అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్

 అతనెక్కడికీ వెళ్లలేదు
                     - చిత్తలూరి ఎస్సెన్

అతనెక్కడికీ వెళ్లలేదు
మంచివాళ్లెక్కడికైనా వెళ్లగలరా?
ఒక పాటగానో మాటగానో
ప్రజల మనసుల్లో
చెరగని ముద్రలు వేసినవాళ్లు
ఎక్కడికెళ్లగలరు?
గుండెల్లోనే గూడుకట్టుకుని వుంటారు
ప్రజల ప్రాణ శ్వాసకు
స్వర కల్పనలు చేస్తూ వినిపిస్తారు
అతనూ అంతే
అతనెక్కడికీ వెళ్లిపోలేదు

మన నరాలను
వీణా తంత్రుల్ని చేసి మీటినవాడు
మన దేహాలను  
సంగీతం పెట్టెలా మార్చి
పులకింప చేసినవాడు
మన యాసలో ధ్యాసలో
మన శ్వాసలో
పాటల ప్రాణవాయువై
మోగినవాడు
అతనెక్కడికెళ్లగలడు?
అతనెక్కడికీ వెళ్ల లేదు

దేశానికి పాటనిచ్చి
ప్రపంచానికి మనదైన స్వరాన్నిచ్చి
మన కీర్తి ప్రతిష్టలకు
తనదైన బాణీ  కూర్చి ఇచ్చినవాడు
మన గుండె లబ్ డబ్ ల సంగీతంలో
శృతి లయలై పరుచుకున్నవాడు
అతనెక్కడికీ వెళ్లలేదు

కొత్త కొత్త చరణాలు
తూలిపడుతున్న చోట
పల్లవిగా నిలబడి
పాట భుజం తట్టినవాడు
పాడుతా తియ్యగా అంటూ
పలకరించినవాడు
అతనెక్కడికెళ్లగలడు?

మన పాటకి పల్లవిగా
మన రాగానికి తాళంగా
మన జీవన సంగీతానికి
మధురమైన స్వరంగా
మనిషి గొంతు విప్పిన ప్రతి చోట
పాటై మోగుతూనే వుంటాడు

అతనెక్కడికెళ్లగలడు?
మంచివాళ్లెక్కడికెళ్లగలరు
కవులూ, కళాకారులూ
ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన
చైతన్య భావదారలు
మేధావులు, ఉద్యమకారులు
సామాన్యుల్లోని అసామాన్యులు
ఎక్కడికెళ్లగలరు?

మన గుండె గొంతులో
నిత్యం ఒక స్ఫూర్తి పాఠంగానో
కదిలించే కరిగించే కమ్మని పాటగానో
మనకు వినబడుతూనే వుంటారు
పిట్ట,  గూడు ఖాళీ చేసినా
చెట్టుకిచ్చిన పచ్చదనపు పాటలా
తప్పక మనతోనే వుంటారు
అతనూ అంతే
అతనెక్కడికీ వెళ్లలేదు!

                    - చిత్తలూరి ఎస్సెన్
* S.P బాలుకు నివాళిగా నా ఈ కవిత
నా స్వరంలో వినాలనుకుంటే
నా యూట్యూబ్ ఛానల్ Chittaluri SN
ని చూడండి


 

Follow the below youtube link for more Chittaluri Kavithalu

https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు