నాలుగంటే నాలుగే...

నిలువ నీడకో  ఇల్లు

పొట్టకూటికో ముద్ద

చుట్టుకొనుటకో గుడ్డ

అలుపు తీర్చే ఓ ముద్దు

ఈ నాలుగే ఇంకేం లేదు మరి…

బతుకునీడ్చేందుకు నాలుగు రాళ్లు

పంచుకునేందుకు నలుగురు మిత్రులు

గుర్తుకుచేసుకునేందుకు ఓ నాలుగు ఙ్ఞాపకాలు

నీ ప్రయాణానికి నాలుగడుగులు

నాలుగే నాలుగు ఇంకేం లేదు మరి…

జీవితపుటంచున నాలుగు పాఠాలు

నువు నేర్చిన ఓ నాలుగనుభవాలు

గెలుపు, ఓటమి ప్రసక్తే వద్దు

ప్రయత్నించే తెగువ చాలు

నిను కాల్చేందుకు నాలుగు కట్టెలు

నిను మోసేందుకు నలుగురు కర్తలు

నీకై ఏడ్చే నలుగురు మనుషులు

నిను ఙ్ఞప్తికి చేసే నాలుగు తరాలు

ఇంకే కోట్లు అక్కర్లేదు

ఇంకే మిద్దెలు వద్దే వద్దు

ఉరుకులు పరుగుల ఊసే వద్దు

పాపపు బతుకుల పాటే వద్దు

నేను,నాదని స్వార్ధం వీడి

నువ్వునేను, నీతో నేనని నడక మొదలుపెట్టు

ఎంతో దూరం అక్కర్లేదు

ఓ నాలుగడుగులు చాలు.

నాలుగంటే నాలుగే ఇంకేం  అక్కర్లేదు

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్