అంతెరుగని ఈ పయనంలో...

పగ్గం తెంచుకున్న పసిడెద్దులా
పందెంలో పోటెద్దులా
మది మళ్ళీ మళ్ళీ పరుగులు తీస్తుంది.

తప్పేదో ఒప్పేదో తెలుసుకునే ఆరాటంలో
నిజమేదో అబద్ధమేదో తెలియని ఈ దొంగాటలో
సత్యశోధనకై సాగిపోతానంది

నేనేదో నువ్వేదో వేరు చేయలేని బంధంలో
నిలువునా గోడలెలా పెరిగాయని ప్రశ్నలు వేస్తుంటే
ప్రతి ప్రశ్నకి బదులు వెతికే ప్రయత్నం చేస్తుంది

పారే నదిలా కాలం కరిగిపోతుంటే
జాలువారే నీరై సాగిపోక
ప్రాణం లేని శిలలా అక్కడే నిల్చుని చింతిస్తుంది.

అంతెరుగని ఈ పయనంలో
పరస్పరం విరుద్ధ మార్గాలే కనిపిస్తుంటే
కనిపించని తన దారేదో కనుక్కునే పనిలో పడింది

మనిషి మనిషిని మార్చి చూసే మనుషులతో
మనుగడ భారమనిపించి
మరో లోకంకి మార్గమెతుక్కుంటుంది.

మూగబోతున్న రాగాల్ని మెల్లగా తొక్కేస్తూ
కారే కన్నీటితో దారంతా తడిపేస్తూ
ఎగిరెగిరి పడుతున్న ధూళిని తానే కడిగేస్తుంది

అడ్డొచ్చిన అదృష్టాన్నయినా సరే ఆనందంగా పక్కకి నెట్టేస్తూ
ఆవేశం తోడై అడ్డదిడ్డంగా అడుగులేస్తూ
తిరిగి తిరిగి అలసిపోయి తీరంకోసం వెతుకులాడింది

తోడొచ్చే వారెవరో
సేదతీర్చే గూడేదో
కొంచెమైనా తెలియని అయోమయంలో
కాలమాడే ఆటకి ప్రత్యర్ధై నిల్చుని
పయనించే దారెరుగక పడిగాపులు కాస్తుంది

సద్దన్నమో సల్లపెరుగో ఒక్క ముద్ద తోడైతే
తల్లిని చేరిన దూడలా తరించిపోతానంది
తండ్రి ఒళ్ళో పాపలా మైమరిచి నిద్రిస్తానంది.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్