అన్నా రైతన్నా... ఆత్మహత్యలొద్దన్నా...

కరం కరం నిరంతరం పనిజేస్తే బతుకుడాయె

క్షణక్షణం అనుక్షణం అసమానపు బ్రతుకులాయె

 

రెక్కాడితె డొక్కాడే లేనినాడు పస్తులాయె

రేపన్నది ఎట్లుంటదో తెలువక దింపుకోని దిగులాయె

 

శ్రమకోర్చి కర్మకోర్చి రంగంలో దిగుడాయె

రైతన్న బిడ్డలకి పొలమే రణరంగమాయె

 

దుమ్మనక ధూళనక దుక్కులన్ని దున్నుడాయె

కర్రుగట్టి, గొఱ్ఱుగొట్టి నున్నంగ జేసుడాయె

 

రాళ్లు రప్పలు మరిచి నొప్పులు నిప్పులకోర్చి

విత్తనాలు జల్లుడాయే పోగుంటలు పెట్టుడాయె

 

నీడలేక నిద్రలేక నీళ్లు కట్టి తడుపుడాయె

నిప్పులు కురిసే ఎండలు నీకేమో దోస్తులాయె

 

కలుపుతీసి కుప్పలెత్తి కంటినిండ నిద్రవోక

కరువునుండి వరదనుండి కాపాడగ కావలుండె

 

పొద్దనక మాపనక కష్టసుఖాలకోర్చి

సద్దులు మొద్దులు మోసి సక్కంగ పెంచుడాయె

 

పిండిజల్లి మందుగొట్టి పసిబిడ్డలవోలె పెంచి

కొయ్యబోతె చెయ్యబోతె చెప్పలేని కూల్లాయె

 

కొన్నప్పుడు కొరివాయె, అమ్మినపుడు అడ్డికి పావుషేరు

తిరిగిచూస్తే అప్పులాయె, తిరగకుంటె తప్పదాయె

 

జేబుజూస్తె కుల్లాయే జేబుకింద గుబులాయె

చేసిన కష్టం బూదేవరకయ్యె చేతిలో చిప్ప మిగిలె…

 

అన్నా రైతన్న నీకెవరున్నారన్న

అన్నా రైతన్న నీకు నువ్వె దిక్కన్న

 

అన్నా రైతన్న అదిరిపోకు చెదిరిపోకు

అన్నా రైతన్న బెదిరిపోయి రాలిపోకు

 

అవ్వ అయ్యలలెక్క దేశానికి దిక్కు నువ్వు

సరిహద్దున జవానులెక్క పొట్టల రక్షణ నువ్వు

 

పిరికిపనులు వద్దన్నా నిత్యపోరు వృత్తి మనది

చివరిదాక నిలవాలే పోరాడి గెలవాలే

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్